గణనాథుడి సన్నిధిలో ఏసీపీ, సీఐల ప్రత్యేక పూజలు

బాలానగర్, సెప్టెంబర్ 16: బాలానగర్ వినాయకనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఏసీపీ నరేష్‌రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ సందర్శించారు. మండప నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన వారు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ.. తమ ఆహ్వానాన్ని స్వీకరించి వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏసీపీ నరేష్‌రెడ్డి, సీఐ ప్రశాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినాయకనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.